Tuesday 7 January 2020

కేటాయింపులు - మార్పుకి ఇది సమయం

కేటాయింపులు (రిసర్వేషన్స్) చాల మంది దానికి వ్యతిరేకము, కానీ అది అప్పుడు ఇప్పుడు కుడా చాల అవసరము. అప్పుడు సామజిక స్థితి గతులను పరిశిలిస్తే ఈ కేటాయింపులు లేక పోతే అణగారిన వర్గాల వారు ఎప్పుడూ అలానే వుండేవారు, అంటారని వారు అంటారని వారిలానె వుండే వారు. అప్పుడు అంబేత్కర్ 10 సంవత్సరాలేనని చెప్పిన మన రాజకీయనాయకులు దానిని పొడిగించి చాల మంచి పని చేశారు. కానీ మన రాష్ట్రాలలో దాని ఫలాలు అందినట్టుగా దేశంలో అన్ని చోట్ల దాని ఫలాలు ఇంక అందలేదు. కాకాపోతే గడిచిన ఏడు దశాభ్ధాలలో చాల మార్పులు వచ్చాయి, ఒకప్పుడు అంటరాని వారని అన్నవారిలో కొందరు ఇప్పుడు కోటేశ్వరులు అయ్యారు, అగ్రకులాల వరాన్న వారు ఇప్పుడు బికారులు అయ్యారు. మరి ఇంక అదే కేటాయింపులు ఎందుకు?

నేను చుసిన వారిలోఈ కేటాయిపులని వాడు కొన్న వాళ్ళు వున్నారు. ఒకటి మా స్నేహితుడు వాళ్ళు ఇద్దరు వాడు, వాళ్ళ అన్న కానీ, వాళ్ళ రేషన్ కార్డులో నలుగురి పేర్లు వున్నాయి, మరి విల్లెవారని అని అడిగితే వాడు ఏమి చెప్పాడంటే వాళ్ళు వాళ్ళ బాబాయి పిల్లలు అని, అయన ఉద్యోగస్తుడు అని ఒక వేల ఎప్పుడైనా ప్రభుత్వం ఉద్యోగస్తుల పిల్లలకి ఈ కేటాయింపులు తిసి వేస్తే సమస్య వస్తుందని, అయన చేసినా తెలివైన పని అది, అయన పిల్లలని అన్నయ్య పిల్లలుగా చేసాడు. వారికి అలాంటి అవసరమేమి రాలేదు, చదువులో కేటాయింపులు వాడుకోన్నారో లేదో గాని వాళ్ళిప్పుడు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. రెండవది నా జూనియర్ వాళ్ళ అమ్మానాన్నలు ఇద్దరు మన హైదరాబాదులో మంచిగా ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాదించారు, అలంటి వారు వాడిని చిన్నప్పటినుంచి  కాన్వెంటుల లోనే చదివించారు, వాడు ఈ కేటాయిపులతొ ఐఐటి లో సీటు వచ్చినది, ఆ తర్వాత ఐఐయం లో కుడా సీటు వచ్చినది, ఇప్పుడు ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ రెండు ఉధహరణలలో ఎవరికి ఈ కేటాయిపులు ఆవసరం లేదని నా వుద్దేశం, నాకు తెలిసి నా చిన్నప్పుడు నా మిత్రులు అగ్రాకులాలుగా చెప్పబడే వాటిలో వుండి కూడా వారి ఇళ్లలో చదివించే ఓపిక లేక చాల మంది మానేశారు. మొన్ననే ఒక పత్రికలో చదివాను, మన ప్రభుత్వాలు ఉపకార  వెతనలు BC లకి ఒక లక్ష, SC లకి రెండు లక్షలు లోపు ఆదాయం ఉన్నవారికే వర్తిస్తాయని ప్రకటించింది. అంటే BCల లక్ష SC ల రెండు లక్షలకూ సమానం ఎలా అవుతుంది? అదే OC లకి అదయమేమి లేక పోయినా అది వర్తించదు. ఇదేమి న్యాయం.

ఈ  రకం కుల ఆధారిత కేటాయింపుల వలనా ఎక్కువగా నష్టపోతుంది వారే అని గ్రహించటం లేదు అది ఎలా అంటే ఈ  కేటాయిపుల వలనా ప్రభుత్వరంగ సంస్థలు అన్ని అభివృద్ధి కి నోచుకోవటం లేదు. పాఠశాలలు, ఆసుపత్రులు అన్ని వెనుక పడి పోతున్నాయి. ప్రభుత్వము అన్నింటిని ప్రయవేటికరణ చేస్తుంది. వేరే విధంగా వచ్చే చాల ఉద్యోగాలు ఎవరికి రావటం లేదు. పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్న ఎవరు వెళ్లటం లేదు, అల ప్రాధమిక అవసరాలైన విద్యా, వైద్యం రెండు కుంటుపడుతున్నాయి.  అది గాక ఈ కేటాయింపులను వాడు కొన్న వాల్లే వాటిని మళ్ళి మళ్ళి వాడుకొంటున్నారు. వెనుక వున్న వారికీ ఆ ఆవకశం ఎప్పటికి రాదు.

ఈ కుల ఆధారిత కేటాయింపుల ఇప్పటికైనా మారక పోతే మన దేశం చాల నష్టపోతుంది. ఈ కేటాయింపులు వున్న బిదవారు ఇంకా బిదవారు అవుతారు. ఇప్పుడు ఉన్న కుల ఆధారిత కేటాయింపులను పక్కన పెట్టి ఆర్ధిక సామర్ద్య ఆదారిత  విభజన చెయ్యాలి, మద్య తరగతి వరకూ వున్న వారందరిని కొన్ని తరగతులుగా విభజించి, ఇప్పుడు వున్న కుల ఆధారిత కేటాయింపులను అందులో పొందుపరచి తర్వాత వారి ఆర్ధిక  స్థోమతలను బట్టి వారి తరగతులను మార్చాలి. అప్పుడు ఈ కుల ఆధారిత ఉద్యమాలు, చీలికలు, ఓటు బ్యాంకు రాజకీయాలు పోతాయి, వారి వారి  ఆర్ధిక  స్థోమతలను బట్టి అందరు లబ్ది పొందుతారు.  ఇది చదువులోనే ఇవ్వాలే తప్ప ఉద్యోగాలలో ఇవ్వకూడదు, ఒక వేళ ఇవ్వవలసి వచ్చిన అది అన్నింటికి వర్తించ కూడదు, ఎలాంటివి అంటే శాస్రవేత్తలు, వైద్యులు, ఉపాద్యాయులు మరియు అర్కిటేక్లు లాంటివి. కాకాపోతే మనవారు మహా మేధావులు చాల మంది ఆరోగ్య శ్రీ కోసం అందరు లంచాలు గుమ్మరించి తెల్ల రేషను కార్డులు పొందారు. అలానే లంచాలు ఇచ్చి ఈ తరగతులు కూడా మార్చేయగలరు. UPలో SC అని సర్టిఫికేట్ పుట్టించి MPలే అయిన వారు వున్నారు. ఇలాంటివి నిరోధించా గలిగిన నాడు దేశం, ప్రజలు  అభివృద్ధి చెందుతారు.

బ్రహ్మ ముడి

ఆ రోజు శివరాత్రి. అక్క, బావ ముందు రోజే వచ్చారు. కానీ ఇంటిలొ ఏ హడహుడి లేదు. మూకీ సినిమాలోల ఎవరి పని వారు చేసుకు పోతున్నారు. అప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చిన నాకు అర్దం అయింది.  ఉదయాన్నే చాలా తివ్రంగా చర్చలు జరిగి విఫలం అయ్యయని. అందుకే అందరూ మౌనంగ ఉన్నారు. ఆ వాతావరణంని చూసి, నాకు నీరసం వచ్చింది. బ్రష్ చేసూకుంటూ కారు కడుగుతున్న బావా దగ్గరకు వెళ్ళాను. కారు వెనుకాల అక్క నిలబడి బావాతో ఏదో చెప్తుంది. నన్నూ చూసి ఆపీ ఇంటి వైపు నడుస్తూంది. పిల్లలు ఎక్కడా అంటే పక్కింటికి ఆడుకోటానికి వెళ్ళరు అని చేప్పి వెళ్ళపోయింది
బావా దగ్గరకు వెళ్లి ఎం జరిగింది అని అడిగాను. ఆయన రుద్దిందే మళ్ళీ రుద్దుకుంటూ, నా వైపు చూడకుండ‌‌, సాయంత్రం ఊరికి వేళ్తూన్నమని చెప్పాడు. అదేంటి వచ్చిన పని అవ్వకుండానే వెళ్తారా అన్నాను. అర్జంటుగా వెళ్ళాసిన పని పడింది అన్నాడు. సరేగానీ ఇప్పుడు నిజం చేప్పమన్నను. దానికి బదులుగా మీకూ చేప్పి ఒప్పించటం మా వల్లేంఅవుతుంది అన్నాడు. మీరు బాగానే వుంటారు, మేము శత్రువులం అవుతున్నాము. ఏం అయింది అని అడిగాను. నువ్వు ఆయన్ని ఒప్పించమంటావు, ఆయన నీన్నూ ఒప్పించమంటాడు. మళ్ళీ ఈ ఉదయాన్నే నేను ఆయనకు చేప్పేట్టందుకు ప్రయత్నించనాని కోపంతో మమ్మల్ని అరుచూకుంటూ బయటకు వెళ్ళిపోయడు. ఆయన్నీ ఒప్పించేదుకు అయితే మల్లి ఇంటికి రావద్దని అన్నాడు. దానికి మీ అక్కకి కోపం వచ్చి, వెళ్లి పోదాం అంటుంది. అప్పుడు నాకు పూర్తిగా అర్థం అయ్యింది, జరిగిన కథ.
అదేంటి బావా ఏదైనా చేసి ఒప్పీంచు, అని ఆయన మీ మాట వినకపోతే ఎవరి మాట వినడు. మీరే నా ఆకరి ఆశ. ఇప్పుడు కాకపోతే ఇంకా కష్టం, ఈ రెండు నెలలూ పోతే, సంవత్సరం వరకూ ముహూర్తలు కూడ లేవంట. ఆయనకు నచ్చే సంభంధం నాకు నచ్చదు, నాకూ ఈ జన్మలో పెళ్లి కాదు అన్నాను. నా మాటలలో నీరసం‌, నిరాశ, అసహయత అన్నీ కనిపించి ఉంటాయి బావాకి. ఏదో ఆలోచించి కొంచం సేపు, సరే నువ్వేళ్ళి టిఫిన్ చేయమంటూ నన్నూ పంప్పిచేశాడు. టిఫిన్ చేసి బయటకు వచ్చేసరికి మరేజ్ బ్రోకర్తో సాయంత్రం పెళ్ళి చూపులకు వస్తున్నామనీ చెప్తున్నాడు. నాకు ఏమి అర్ధం కాలేదు. నా వైపు తిరిగి సాయంత్రం వెళ్తున్నము అన్నాడు.
మరి నాన్న అన్నాను, నాకు వదిలేయ్ అన్నాడు. ఆ మాటతో టిఫిన్ చేసిన రాని శక్తి వచ్చింది. బావ ఎదో మాయ చేస్తాడన్న కోంచం నమ్మకంతొ, కొంచం టెన్షన్తో లోపలికి వచ్చాను. నాన్న ఇంట్లోకి రావటం లేదు, నేను బయటకు వెళ్ళలేదు. అమ్మ పనులు ఇంట్లో చేసూకుంటూంది. కొంచెం సేపటీకి బావ, నాన్న బయట వేప చేట్టూకింద కూర్చోని మాట్లాడుకుంటున్నారు అని అక్క ఆంటుంది అమ్మ తో!   వారు మాట్లాడుకునే విషయాలు అమ్మకి మొస్తూంది. నేెను నా లాప్టాప్ ముందేసుకోని అక్క అమ్మతో చేప్తూన్న మాటలు పై ఒక చెవి ఉంచాను. బావా చాలా రకాలుగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మధ్యహ్నం అయింది, అయినా నాన్న ఒప్పుకోలేదు.
మధ్యహ్నం తరువాత పెళ్లి చూపులు చూసి వచ్చి నచ్చలేదని చేప్దం అనీ కన్వీన్స్ చేయటానికి ప్రయత్నించాడు. కానీ ఉపయోగం లేదు.
చివరికి నాన్న రాకుండానే పెళ్లి చూపులకు బయలు దేరాము.
అమ్మయి బాగుంది, ఎవరు ఏ ఒంక పెటేందుకు ఎంలేదు. కాని బావా వేరేవిధంగా మాట్లాడటం మొదలు పెట్టేడు. ఇది ఒక  అప్షన్ అని ఇంతకన్నా మంచివి ఇంకా ఉంటాయి అని, ఇది వదులుకుందాం అని, నాకు ఇది సరైనది కాదని ఒప్పించటానికి ప్రయత్నం చేయటం మొదలు పెట్టాడు. నేను ససేమిరా ఒప్పుకోలేదు. చీవరకి బావాతొ ఈ పెళ్లి చేసేట్లు అయితే నాతో మాట్లాడమని తెగేసి చేప్పాను. నాకు బావా పరిస్థితి అర్థం అయినా నాన్న మీద కోపం, ఆ అమ్మాయిలో ఏమీ లోపం లేక పోవడం, ఒక విదమైన ప్రస్ట్రేషన్ నన్ను అలా మాట్లాడేలా చేశాయి. బావ బాగా ఆలోచించి నా పెళ్లి చేసే బాధ్యత ఆయనది అని, కానీ నా ఆదర్శాలు అంటూ ఇంకా మధ్యలో వేలు పెట్టోధ్ధాని మాట తీసుకుని వెళ్ళాడు.
తర్వాత ఎక్కువ కట్నం కావాలని, పెళ్ళి బాగా చెయ్యాలని వారిని బాగానే లాగి, చివరికి పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి అయ్యింది, అంతా శుభం.

ఆ శివరాత్రి నాడే మాకు ముడి వేశాడా బ్రహ్మ.

ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగావుతయా?

నా చిన్నప్పుడు ఒక 25 సంవత్సరాలకి ముందు  ప్రభుత్వ పాఠశాలలే వుండేవి, అప్పుడే పుట్ట గోడుగులులా ఒకొక్క ప్రైవేట్ పాఠశాలలు మొదలవుతున్నా రోజులు. వాటినే కాన్వెంటులు అనేవారు. వాటికి బాగా బలసిన వాళ్ళే పిల్లలను పంపే వారు. అప్పుడే ఉద్యోగాలూ పెరుగుతున్న రోజులు అవి. చదివి ఉద్యోగం రాకపోతే ఎందుకు కాకుండా పోతారని చాల మంది పెద్ద చదువులు అంటే 10 తర్వాత పంపించటానికి కూడా ఇష్టపడే వారు కాదు. అలాంటిది ఇప్పుడు అందరు కాన్వెంటులకే పంపిస్తున్నారు. అప్పటిలో ప్రభుత్వ పాఠశాలలుకే పిల్లలు అంతంత మాత్రంగా వెళ్లటం వలనా కాలిగా వుండేవి, ఇప్పుడు అందరు టాలెంట్/టెక్నో స్కూల్ లకే పంపుతున్నారు కనుక కాలిగా వుంటున్నాయి.

2000 నుంచి చూస్తున్నాను మన ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మద్యమ పాటశాలలుగా మారుస్తారని, తెలుగు భాషనీ బ్రతికించాలి, రక్షించుకోవలని‌‌, ఇలా చెప్తూ వాటిని తెలుగు మాధ్యమంలోనే వుంచి అదోగతి పాలు చేస్తున్నారు. నాకు తెలుసు చాల మంది నాతో విబెదిస్తారు, కానీ ఇది నిజం. నాకు ఒక్కరిని చూపించండి తెలుగు భాష పరిరక్షన సమితి (ఏదైతే అది) దానిలో వుండి వాళ్ళ పిల్లలని లేక మనుమాలని తెలుగు మాధ్యమంలో చదివించే వారిని. మనం రోజుకొనే ఒక్క వస్తువు చూపించండి దానిపై అన్ని తెలుగులో రాసి వున్నవి లేక ఒక మందు పేరు చూపించండి లేక ఒక్క ప్రభుత్వ పత్రం చూపించండి ఇంగ్లీష్ లేకుండా (ఈ మద్య కొన్ని తెలుగులో కూడా వస్తున్నాయి, ఇంతకి ముందు అన్నిఇంగ్లీష్ లోనే  వుండేవి). మొన్ని మద్య ఓ మహాకవి గారు దూరదర్శన్ లో  కనిపించి "మా మనుమరల్లకు తెలుగు రాదు వాళ్ళు అమెరికాలో పుట్టి పెరిగారు, వాళ్ళు ఆంగ్లము లో పద్యాలూ రాస్తారు" అని చెప్పారు. అది అయన తప్పని నేను అనటం లేదు, వారికి తెలుగుని బ్రతికించాలని కోరిక వుంటే దానిని వారి పిల్లల మీద రుద్దాలి కానీ, రాష్ట్రం మొత్తం మీద ఎందుకు నెట్టాలి.

మన కర్మ కాలి పదిదాకా ఇంగ్లీష్ భాష వున్న దానిని సరిగా చెప్పే గురువులు లేక ఇస్ వాస్ ఎక్కడ వాడలో కూడా తెలియదు. డిగ్రీ చదివిన బ్యాంకు నుంచి ఎదైన ఉత్తరం వస్తే దానిని మళ్ళి బ్యాంకుకే వెళ్లి అడిగే వాళ్ళు చాలామంది వున్నారు. మరి ఎందుకి చదువులు. ఇంతక ముందు చదవక(తెలుగు) నిరక్షరస్యులు, ఇప్పుడు చదివి(తెలుగు) నిరక్షరస్యులు అంతే. ప్రయివేటు విద్యాసంస్థలు ఎంత మొత్తాలు ప్రభుత్వాలకి ముట్ట చెప్తున్నాయో కానీ ప్రభుత్వాలు పిల్లలకి భోజనాలు, గుడ్లు అని సంభందంలేని మాటలు చెప్తారే కానీ పనికొచ్చే మాట ఒక్కటి చెప్పారు. దీని వలనా తెలుగులో అనర్గళంగా మాట్లాడే వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో నోరు మేధాపలేక ఉద్యోగాలు రాక కష్టపడుతున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కనిసం పిల్లలు లేక అటూ అద్యపకులకి, ఇటూ విద్యార్ధులకి అనశక్తి పుడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు వారికీ వారే రెండో తరగతి మనుషులుగా భావానకు గురిఅవుతున్నారు.

 ప్రైవేట్ పాఠశాలలో ఉర్తిర్నులైన అద్యపకులు లేక పోయినా అవి ప్రభుత్వ పాఠశాలలు కన్నా ముందంజలో వుంటున్నాయి. గడిచిన ముప్పై సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన మార్పులేన్నీ, ఒక్కొక్క కంప్యూటర్ కొనిచ్చి కంప్యూటర్ నేర్పించండి అంటే సరిపోతుందా? దానిలో అన్న తెలుగు వుందా? దానిని నేర్పేందుకు సరయిన అద్యపకులను నియమించిందా?

నాకు ఈ మద్య వచ్చిన సందేహం ఏమిటంటే మన కొత్త ప్రభుత్వం ఒక పేరెన్నికగన్న ప్రైవేట్ విద్య  సంస్థల చేర్మన్ ని మంత్రి వర్గం లో వుంచింది, అతను వారి పార్టిలో ముందునుంచి ఎం సేవ చేసాడో వారికే తెలియదు, వేరే వేరే సంఘ సంస్కరణలు కూడా ఏమి వినలేదు కానీ ఆయనని ఒక మంత్రిని చేసింది అంటే అయన మరి ఎంత ముట ఇచ్చాడో?

ఈ ఐదు సంవత్సరాలలో ఏమైన అవ్వొచ్చు.

ఎటు ప్రభుత్వ పాఠశాలలు/ కళాశాలలులో పిల్లలు లేరు కనుక వాటి బడ్జెట్ ఎక్కువ అవుతుందని, అవే డబ్బులు  ప్రైవేట్ పాఠశాలకి చెల్లించి చదివిద్దాం అని కొత్త చట్టం రావొచ్చు. ఇలా వారి ఋణం తిర్చుకోవాచ్చు. లేక ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలలను ఇంకా అదోగాతికి చేర్చె ప్రణాళికలు రూపొందించ వచ్చు.

గమనిక: నేను ఈ ప్రభుత్వమే రావాలి అని కోరుకున్న వాడిని అలా అని ప్రతీ పనిని సమర్ధించ లేము కదా!

కల్లు తగిన కోతి...

మా ఉరిలో ఐదో తరగతి వరకే ఉండేది. ఐదు తర్వాత చదవాలంటే బడికి నాలుగు కిలోమీటరులు నడచి పక్క ఊరు వెల్ల వలసి వచ్చేది. కాలాన్ని బట్టి వర్షకాలంలో గ్రావెల్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, అదే వానలు తగ్గేకొద్ది పోలలలో కుండా షార్ట్ కట్స్ దారులు ఏర్పడేవి. వాటిలోంచి వెలుతు పక్క పొలాలలో వుండేవి అన్నీ తింటూ వెళ్ళే వాళ్లము. పిల్లలం కదా స్కూల్లో కూడా తినటానికి, స్నేహితులకి పెట్టటానికి సరిపడేల చాల కోసుకు వెళ్ళే వాళ్ళం. కంది కాయలు, పెసర కాయలు, మోకజోన్న కండెలు ఇలాంటివి పైన కాచేవి కనుక అంత తెలిసేది కాదు, వేరుశనగ లాంటివి భుమిలో వుంటాయి కనుక పీకితే తెలిసి పోయేయి. ఆ చేల వాళ్ళు పిల్లల నుండి కాపాడుకోవటానికి పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపలా వుండే వాళ్ళు.


జనవరి  తర్వాత చాల రకాలు వుండేవి, పంటలే కాక కొండ మీద కలేకాయలు, పుల్లరేగి కాయలు, ఈత కాయలు ఇలా, పోటీలు పడి కోసి తీసుకు వెళ్ళే వాళ్ళమీ స్నేహితులకి పంచటానికి. ఎండా కాలం లో ఇవే కాక రేగి కాయలు, తాటి మున్జలు చాల వుండేవి తినటానికి. ఇవే కాక రోడ్లమ్మట ఇంక చాల చెట్లు వుండేవి వాటిల్లో చాల తినే వాళ్ళము నాజేడు గుబ్బలు అని, ఇంకా చాల వాటి పేర్లు గుర్తులేవు, ఇప్పుడూ ఆలోచిస్తుంటే అవి అన్ని తినోచ్చో లేదో కూడా తెలియదు కానీ తిన్నాము. అదిగాక పొలాలకి పురుగు మందులు కుడా వేసే వాళ్ళు కాదు కనుక సరిపోయింది. ఇప్పుడూ గులికాలని, రోగారు, నవక్రను ఇలా చాల మందులు వేస్తున్నారు.

ఒక  సారి ఏమైనధంటే దారి పక్కనే తాటి చెట్లు వుండేవి, వాటికి కళ్ళు కుండలు కట్టి వుండేవి ఎప్పుడూ. ఎందుకో ఆ రోజు పిల్లలం పందెం పెట్టుకోన్నం అవి పగల కొట్టాలని, చుట్టూ ఎవరు రావటం లేదని నిర్ధరించుకొని, కొట్టటానికి సిద్దం అయ్యాము. చిన్న పిల్లలం కనుక అంత ఎత్తు రాయి వెళ్ళటమే కష్టం, మళ్ళి దానిని కుండకి గురి పెట్టాలి. ఒక చెట్టుకు రెండు కుండలు వున్నాయి అది ఎంచుకొని కొట్టటం ప్రారంభించాము. మేము సుమారు పది మంది వున్నాము అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి అందరం రాళ్ళు వేసము ఒక్కడిది తగిలి ఒక కుండా పగిలింది. కళ్ళు కారుతుంటే ఒకడు వెళ్లి కాళి అయిన టిఫన్ బాక్స్ పట్టాడు. అది అందరు తాగేసారు అందారు అక్కడి నుండి బయలు దేరారు. నకివ్వలేధనుకుంటా నాకు కోపం వచ్చి ఇంకో రాయి తీసుకొని వేసాను, అది లక్కిగా రెండో కుండకి తగిలి చిన్న బొక్క పడింది, సన్నగా ధారా పడుతుంటే నా బాక్స్ నిండుగా పట్టీ ఇంకా పట్టాలని ఒక సైడ్ నుంచి తాగటం మొదలు పెట్టాను. మా వాళ్ళు ఇంకో బాక్స్ తెచ్చే దాక తాగుతునే వున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్దగ మిగలేదు. ఫుల్ గా తాగటం వలనా ఎక్కేసింది, ఇంటికి వుగుతునే వెళ్ళాను, వాసనకి ఇంట్లో వాల్లకి వెంటనే అర్ధం అయింది. ఎద్దులని కొట్టే చంట్రకోలా తీసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిచ్చి కొట్టుడు కొట్టారు. కానీ ఫుల్ గా ఎక్కటం వలనా ఎందుకు కొడుతున్నారో కూడా అర్ధం కాలేదు. ఉదయం లేచి చుస్తే వాతలు కట్టి వున్నయి. అప్పుడు అర్ధమైంది నిన్న చేసినా వెధవ పని!

సత్భోగి
16th June 2014

జగనన్న జగన్నాటకం - ముడు రాజధానుల మూల కథ.

అమరావతి..!! ముందున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బహుగొప్పగా మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం. ముందున్న ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోని అన్ని గొప్ప నగరాలని ప్రజలకు అక్కడే చూపించారు. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మించి రైతులిచ్ఛే పొలంకి కొన్ని రెట్లు విలువ చేసే నివాస స్థలం మరియు కొంత వాణిజ్యని కి ఉపయోగకరమైన స్థలం ఇస్తామని నమ్మపలికి, సామ, దాన, దండోపాయలను ఉపయోగించి రైతుల దగ్గర నుండి కొన్ని వేల ఎకరాలను సమీకరించటం జరిగినది. అయిష్టంగా అయినా తమ పిల్లల భవిష్యత్ కోసం రైతున్నలు ఇవ్వటం జరిగినది. కొన్ని గ్రామాలు మంగళగిరి-విజయవాడ రోడ్డుకు దగ్గరగా ఉన్నా గ్రామాల్లో భూముల విలువ ముందు నుంచే ఎక్కువగా వుండటం వలన మరియు అభివృద్ధి చేసి తిరిగి ఇచ్చే భూమి విలువ ముందుగా ఉన్న విలువ కన్నా పెద్దగా వుండదు అనే విషయాన్ని పసిగట్టిన రైతులు అధిక సంఖ్యలో విముఖత చూపటం వలన ఆ గ్రామాలాలో భూముల సమీకరణ జరపలేదు. 

అమరావతిలో ముందున్న ప్రభుత్వం ప్రచారం చేసిన తొమ్మిది నగరాలు ఒకే చోట, ఆకాశం అంటే భవనాలు అంటూ అభివృద్ధి కేంద్రీకరించరానాటనికి ప్రయత్నం చేయ్యటం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్-బినామీ ఆస్తులు అని, అభివృద్ధికి లక్షల కోట్ల ఖర్చు అని, ఒక కులా అభివృద్ధి అని, ముంపు ప్రాంతం అని, అధికార వికేంద్రీకృతం అని చాలా కారణాలను చూపి అక్కడ నుంచి రాజధాని మార్చటానికి అన్ని రకాలుగా ప్రయత్నలు చేస్తున్నారు. 

దానిలో భాగంగా ఒక కమిటీ మరియు ఒక కన్సల్టెంట్ ఏజెన్సీకి రాజధాని ఎక్కడ ఉండాలి అనే దానిపై నివేదిక తయారు చేయుటకు నియమించారు. విచిత్రంగా కమిటీ మరియు కన్సల్టెన్సీ మక్కి మక్కి గా మూడు రాజధానులు అని తెలపడం, ఇంకొక వింత మన ముఖ్యమంత్రిగారు ఈ నివేదిక రాక ముందే మూడు రాజధానుల గురించి ఉదాహరణతో అసెంబ్లీ లో  ప్రస్తవించటం, యాదృచ్చికం అనుకోవాలా లేక ఇది పక్క ప్రణాలికతో ముఖ్యమంత్రి గారు చేసిన గారడి అనుకోవాలా?

ఎక్కడో ఒక ములన ఉన్న అభివృద్ధి చెందనీ ఒక దేశన్నీ ఉదాహరణ యిచ్చి దాని లాగానే మనకి మూడు రాజధానులు ఉంటాయి. అది అభివృద్ధి వికేంద్రీకరణ అని, ఈ నివేదికలు రాకముందే మంత్రులు మరియు MLAలు పైన చెప్పిన అమరావతికి గురించిన అన్ని వ్యతిరేక విషయలు ముందే మీడియాతో చెప్పటం. ఈ విషయంలన్నీ ముందుగానే రచించుకొన్న ప్రణాళికలు కావా?

మూడు రాజధానులు ఒకటి పరిపాలన రాజధాని(అసెంబ్లీ), రెండు కార్యనిర్వాహక రాజధాని(సెక్రటేరియట్) మరియు మూడవది న్యాయ రాజధాని(హైకోర్టు).
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆల్రెడీ మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో హైకోర్టు ఆనేది రాష్ట్రరాజధానిలో లేవు మరియు కొన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే హైకోర్టు వున్నది. కానీ గతంలో మనం రెండు రాజధానులు అనే మాట వినలేదు. రాజధాని అనేది ప్రజలకై రాష్ట్రం యొక్క అన్ని పనులు చేసే సెక్రటేరియట్ మరియు వాటిని ఆమోదించే గవర్నర్ వుండే ప్రదేశం. సెక్రెటరియాట్ లో అన్ని   మంత్రుల విభాగాలకు సంభదించిన కార్యాలయలు ఉంటాయి కావున ప్రజలు వారి విజ్ఞప్తిలు మరియు అర్జీలు పెట్టుకొనేందుకు అనువుగా ఉంటుంది. ఇది ప్రజలకి అందుబాటులో వుండాలి. కానీ మన ముఖ్యమంత్రిగారు సెక్రెటరియట్ ని తీసుకువెళ్ళి విశాఖపట్నంలో పెడుతున్నారు. అది రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉంటుందా? అనంతపురం నుంచి విశాఖపట్నం అందుబాటులో ఉంటుందా?  శ్రీకాకుళం నుండి కర్నూలు అందుబాటులో ఉంటుందా?

మిగతా రెండు రాజధానులు హైకోర్టు మరియు అసెంబ్లీ ఎక్కడ ఉన్న సామాన్య ప్రజలకు వాటి అవసరం మరియు వాటి వలన కలిగే అభివృద్ధి పెద్దగా ఏమి ఉండదు. ఎందు కంటే వాటివలన వచ్చే ఉద్యోగాలు చాలా పరిమితం, వాటికి కావల్సిన స్థలం కూడా చాలా తక్కువ. కనుక కార్యనిర్వాహక రాజధాని(exicutive capital) ఉండేదే అసలైన రాజధాని, మూడు రాజధానులు అనేది ప్రజలను తప్పుదోవ పట్టించటానికే తప్ప వేరే ఏమి ఉపయోగం లేదు. కర్నూలులో హైకోర్టు పెట్టేటప్పుడు దాని బెంచ్ అమరావతిలో ఎందుకు? అంటే వారికి అవసరమైన కేసులు అమరావతిలో నడుస్తాయా? అలాంటి అప్పుడు కర్నూలులో హైకోర్టు పెట్టి ఉపయోగం ఏమిటి? 

మరో సందేహం వచ్చే విషయం ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటూనే అభివృద్ధి కేంద్రీకరించటం. ఎలా అంటే ఉమ్మడి రాష్ట్రంలో వుండగానే అభివృద్ధిలో హైదరాబాద్ తరువాత వరుసగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉన్నాయి. ఇప్పటి మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు 80%  అది విశాఖపట్నంలొనే ఉన్నాయి. అది స్టీల్ ప్లాంట్, షిప్యర్డ్, నవల్బేస్, సాఫ్టువేరు కంపెనీలు, పర్యాటకం మరియు సినిమా పరిశ్రమ అన్ని అక్కడే ఉన్నాయి. మరి అక్కడే సెక్రెటరీట్ పెట్టి దానినే రాజధాని చేసి ఇంకా అభివృద్ధి చెయ్యటం ఎందుకు? 

అభివృద్ది వికేంద్రీకరణ లక్ష్యం అయితే అప్పుడు సెక్రెటరీట్ రాయలసీమలో ఉండాలి, అసెంబ్లీ అమరావతిలో ఉండాలి మరియు హైకోర్టు విశాఖపట్నంలో ఉండాలి. అప్పుడే అభివృద్ధి వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతంల అభివృద్ధి ధ్యేయం అనే మాటకి న్యాయం చేసినట్టు అవుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే విశాఖపట్నం కన్నా విజయనగరంలోనో లేక శ్రీకాకుళంలోనో పెట్టాలి. అలానే రాయలసీమ అభివృద్ధి జరగాలంటే రాయలసీమ నాలుగుజిల్లాలకి అందుబాటులో వుండే విధంగా అభివృద్ధి చేయాలి. 

అది అందరికి సెక్రెటరీట్ అందుబాటులో  వుండలంటే అమరావతిలో ఉంటేనే అటు రాయలసీమకు మరియు ఉత్తరాంధ్రకు మధ్యలో ఉంటుంది. అసెంబ్లీ రాయలసీమలో ఉంటే సీమ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నంలో హైకోర్టు పెట్టుకొవచ్చు. 

విశాఖపట్నం మహానగరంగా అభివృద్ధి చెంది విస్తరణ జరిగిన అది రాయలసీమ కన్నా ఎక్కువ ఓర్రిస్స మరియు ఛత్రిస్గఢ్ వారికి ఎక్కువ ఉపయోగకరం.

 మన మంత్రులు చెప్పే లక్షకోట్లు చంద్రన్నా కలలు కన్నా చూపించిన అంతర్జాతీయ మహనగరనికే తప్ప సెక్రెటరీట్ మరియు తదితర నిర్మాణలకు కాదు. అమరావతిలో తలపెట్టిన తొమ్మిది నగరాలను నాలుగు బాగాలు చేసి నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేసే ఆలోచనలు చేయవచ్చును.
 
 మన ముఖ్యమంత్రి గారి మూడు రాజధానుల ప్రతిపాదన ఎక్కువ అభివృద్ధి కేంద్రీకరించటమె తప్ప వికేంద్రీకరణ కాదు. ఇది రాజకీయ మంత్రంగామే తప్ప ప్రజసౌకర్యంకానీ అభివృద్ధి వికేంద్రీకరణ కానీ ఏవిధంగా ఉండదు. ఈ మూడు రాజధానులు ప్రతిపాదన అమలు చేసిన లేక చెయ్యడం కుదరక పోయిన ప్రతిపక్షాలను ఇరుకున పెట్టవచ్చు. ఎలా అంటే అమలు చేస్తే వికేంద్రీకరణ చేశాము అది వారికే సాధ్యం అని, వేరేమైన కారణాల వలన అమలు చేయలేక పోతే అది ప్రతిపక్షాల వలనే కాలేదని. అధికార పార్టీ అమరావతి పరిసర ప్రాంతాల్లో కొంచం వెనుక పడిన మిగతా రాష్ట్రంలో తిరుగులేకుండా ఎదుగుతుంది ఆనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి కలిసొస్తుంది. మన ముఖ్యమంత్రి జగన్ గారికి రాయలసీమ కన్నా ఉత్రాంధ్ర మీద ప్రేమ ఎక్కువ కురిపిస్తున్నారు ఎందుకంటే ఆయన రాయలసీమలో సెక్రెటరియేట్ అంటే మిగతా రాష్ట్ర ప్రజలు మరియు ప్రతిపక్షాలు అందరూ ఆయన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు అని అంటరానా లేక పక్క ప్రణాళికతో విశాఖలో భూదందాకి ఉపక్రమిస్తున్నారా? ఆలోచించాలిసిన విషయం.

కావున ఇది అంత జగనాన్న జగన్నాటకంమె తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ కాదు.
 
అధికార మంత్రులు అమరావతిలో భూమిని ముందు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేసి ఇస్తాము అంటున్నారు. రైతులను ఆందోళన చెందవద్దని వారికి న్యాయం చేస్తామంటున్నారు. మరొకరు భూములు వెనుకకు ఇస్తాము అంటారు. ఉన్న తోటలు తీసేసారు, బొరులు, బావులు పూడ్చేశారు, రోడ్లు డ్రైనేజీలు వేశారు, కొంత కాంక్రీటు పునాదులు వేశారు, కొంత ల్యాండ్ యూనివర్సిటీలకు వేరే కంపెనీలకు, కేంద్రప్రభుత్వంకు, కొంత ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సెక్రెటరీట్, స్టాఫ్ క్వార్టర్స్ కట్టారు. వాటి మధ్య మిగిలిన భూమి చదును చేసి వెనక్కు ఇస్తారా? భూములు వెనుకకు ఇచ్చిన నాలుగు సంవత్సరాల క్రితమే వ్యవసాయం విడిచిపెట్టిన రైతన్నలు వాటికి ఉపయోగ పడే ఎద్దులు, సామగ్రి ఇంటిలో పెట్టుకొని కూర్చోంటారా? లేక అభివృద్ధి చేసి ఇచ్చిన స్థలం రైతుకు తిండి పెడుతుందా? రాజధాని లేక పోతే ఆ భూమి అమ్మోకుని జీవితం మొత్తం బ్రతకాగలడా? 
అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వగలిగిన ప్రాంతంలో మిగతా కట్టడాలకు ఖర్చు ఎక్కవ అవుతుందా? అమరావతిలో రైతుల కోసం అభివృద్ధి, అసెంబ్లీ మరియు కొన్ని భవనాలు కట్టి, విశాఖలో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు విడివిడిగా ఖర్చు ఎక్కువ అవుతుందా? లేక రైతుల కోసం అభివృద్ధి చేసిన అమరావతిలో అన్ని ఒకే చోట ఉండటం ఎక్కువ ఖర్చు అవుతుందా? ఆల అని ముందున్న ప్రభుత్వం ప్రతిపాదించిన తొమ్మిది నగరాలు అమరావతిలో కట్టాల్సిన పని లేదు. పరిపాలనకి అవసరమైన కట్టడాలను కట్టి మిగతా భూమిని భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించే విధంగా వుంచొచ్చు. అవసరం మరియు అణువు దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రభుత్వ భవనాలను మరియు మిగిలిన నగరాలను వేరే వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవచ్చు. 

రైతులు రాజధానికి త్యాగం చేసారని నేను అనను కానీ వారి పిల్లల భవిష్యత్ కోసం ఉద్యోగాలకోసం త్యాగం చేశారు. అది నిరుకారిపోతున్నప్పుడు ఏ త్యాగానికైనా వెనుకాడరు అని ప్రభుత్వం గుర్తించలి. విశాఖలో రాజధాని పెట్టినట్లైతే మునుముందు ప్రత్యేక రాయలసీమ లేక గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంది. 

-సత్భోగి
07జనవరి2020



Monday 5 December 2016

చంద్ర బాబు అప్పుడు ఇప్పుడు....

విన్నాపము: నెను 2003కు చంద్ర బాబు నాయుడు గారికి నెనోక వీర అబిమానిని. 2003 లో ఎన్నికలలో ఓడిపోయిన సమయంలో కంటనీరు పెట్టిన అబిమానిని. రాష్ట్రం ఎమైపోతూందొ అని భయపడిన అబిమానిని. 2014లో అయన ఎన్నీకలో కొరుకున్న వాడిని... నేను వీర అభిమాని నుంచి సామన్య అబిమానిగా మారను... ఇది ఇలనే కొనసాగితె నెను అభిమాని నుంచి సామాన్య ఒటరుగా మారి పర్యయలను వెతుకొవలసి వస్తుంది. ఇది ఎందుకు చెపుతున్నానంటె అప్పటి చంద్రబాబుకి ఇప్పటి చంద్రబాబుకి ఎంత తెడ వచ్చినదో చెప్పటానికె ఈ కధనం.....
‌‌‌‍
అప్పటి బాబు చేతల బాబు, మాటలు తక్కువ....
ఇప్పటి బాబు మాటల బాబు, చేతలు తక్కువ....

అప్పటి బాబు పని రాక్షశుడు...
ఇప్పటి బాబు ప్రగల్బల రాయుడు...

అప్పటి బాబు రాష్ట్ర భవిష్యత్కి ప్రణాళికలు రచించాడు...
ఇప్పటి బాబు తన భవిష్యత్కి ప్రణాళికలు రచించు కుంటున్నడు...

అప్పటి బాబు పాలన పరంగా అకాశన్నీ అందుకునెంత ఎత్తుకెదిగాడు...
ఇప్పటి బాబు జనలకు అర చెతిలొ అకాశన్నీ చుపిస్తున్నాడు...

అప్పటి బాబు ప్రభుత్వ ఉద్యోగులని మూడు చెరువులు నిరు తాగీంచాడు...
ఇప్పటి బాబు వల్లని ముట్టుకొడనీకె భయ పడుతూన్నాడు....

పొయిన ఎన్నికలలొ 2% ఒట్లు ప్రభుత్వ ఉద్యోగుల వలన పోయి ఉండవచ్చెమో కాని.... ఇలాగె గాలిలో మెడలు కడితే అవి కూలటం కాయం.... నాలంటి 10% ఒటర్లు అప్పటి బాబు పాలనాద్యక్ష్యత చూసి వేెశము కాని ఇప్పటి బాబు పలుకుతున్న డాంబికలను చూడటానికి కాదు...

మాకు సింగపూర్లు, మలెషియాలు అవసరం లేదు...
మెట్రో నగరాలు వద్దు... మెము ఆశించినది వచ్చే 20 సంవత్సరాల లో రాష్ట్రంలో 2/3 నగరలనైన పూణె, కోయంబత్తూరు, బరోడ లాంటి 2టైరు న సిటిలకు దిటుగా తిర్చీదిద్ద గలడన్న అప్పటి బాబు పై నమ్మకంతో...

అప్పటి బాబు చెసిన పని, ప్రవేశ పెట్టిన పదకాలు, చెసిన మార్పలలో పదోవంతు పని జరగటం లేదు....

ఇలానే ఉంటే జనం ప్రత్యమ్నయలు వెతుకుంటారనటంలో ఎలాంటి సందేహం లేదు...

Saturday 21 June 2014

బడే గుడి

పల్లెటూరులో వుంటే వానకాలంలో చాల చూడొచ్చు, చెయ్యొచ్చు. అది మా ఊరి ప్రభుత్వ పాఠశాలలో అయితే చెప్పలేము, మేము చదువు కన్నా పిల్లల ఆటలు ఎక్కువగా అడేవాళ్ళము. వానలకి మట్టి తడిసి బొమ్మలు చేసుకోటానికి వీలుగా వుండేది. విరామాలలో పిల్లలం అందరం పందేలు పడి ఒకరికన్నా ఒకరు పెద్ద, అందమైన బొమ్మలు చేసే వారము. ఘంట కొట్టంగానే వాటిని దాచి పెట్టి వెళ్ళే వాళ్ళం. మళ్ళి వచ్చే వారకు అవి ఎండి పొయి, విరిగి పోయి, గేదెలు తొక్కేసి, ఏ కుక్కో ఆగం చేసి వుండేవి. అవి వేరే వాళ్ళు ఆగం చేసారని వాళ్ళతో గొడవ పడి, కొట్లాటలు, పంచాయితీలు, చివరగా ఇద్దరికీ దెబ్బలు, ఇవి అన్ని తరచుగా జరుగుతుండేవి.

అప్పుడు నేను నాల్గవ తరగతి చదువు తున్నాను. అప్పట్లో వినాయక చవితికి వినాయకుని విగ్రహం మట్టితో చేసేవారు. మా వూరిలో మూడు బజారుళ్లో మూడు బొమ్మలు వుంచేవారు. మా బజారులో విగ్రహంచేసేటప్పుడు పిల్లలందరం వెళ్లి దాని దగ్గర కూర్చొనిచూస్తూ, అక్కడి మట్టితో మేము చిన్న చిన్న వేరే వేరే బొమ్మలు చేసే వాళ్ళం. ఆ సంవత్సరం గుడి అంత మట్టి మట్టి చేస్తున్నామని మమల్ని అందరిని తిట్టి బయటకి పంపిచేసారు. మాకు కోపం వచ్చి బడిలో అడుకొందామని వెళ్ళాము. ఆ రోజు వాన పడి తడిసి ఉండటం వలనా ఏమి చెయ్యలో తెలియక వరండాలో కూర్చొని, మట్టి తెచ్చి ఏవో బొమ్మలు చెయ్యటం మొదలు పెట్టం. నేను వినాయకుడిని చేద్దామని చేస్తున్నాను, కొంతసేపటికి అందరు వాళ్ళ బొమ్మలు ఆపేసి బాగా చేస్తున్నాని నాకు సహాయం చెయ్యటం మొదలు పెట్టారు. ఒకడు వెళ్లి వినాయకుని కళ్ళుగా పెట్టటానికి గోలీలు తేచ్చాడు, ఇంకొకడు పెద్ద వినాయికుడికి కను బొమ్మలు, నామాలు, కడియాలు, గొలుసులుల అంటిచటానికి వాళ్ళ నాన్న కలర్ పెపర్లు తెచ్చడాని, వెళ్లి తెలియకుండా ఒక్కొక పేపర్ తీసుకొని వచ్చాడు. అందరం కలసి వినయికుడిని చాల బాగా చేసి అలంకరించం.

మా వాడు ఒకడు వెనకకి తిరిగి మాష్టారురో అని అరిసి పరుగు లంకిచుకొన్నాడు, వాడిని చూసి మిగతా అందరు వాడి వెనకాల పరిగెత్తారు. నేను, ఇంకొకడు మిగిలి పోయం, ఇంట్లో నుంచి తెచ్చిన నీల్ల కడవ, కత్తేర ఇవన్ని అక్కడ వుండటం, అవి తీసుకోకుండా వెళితే ఇక్కడ తప్పిన తన్నులు ఇంటి దగ్గర తినాలి అందుకని. ఆయన మా వేనుకే నిలబడి చూస్తున్నాడు. మా విపు మీద దెబ్బ ఎప్పుడూ పడిద్దో అన్న కంగారుగా నిలబడి వున్నాం. ఆయన చిన్నగా బొమ్మ దగ్గరికి వచ్చి బాగా చూసి ఇది ఎవరు చేశారు అని అడిగాడు. చేసినా వాళ్ళని తంతాడు అనుకొని నేను పోయినా వల్లకల్లి చూపించాను. నాతో వున్నవాడు వీడే అని చెప్పాడు. నేను వాడి కల్లి కోపంగా ఒక చూపు చూసాను. వాడికి అప్పుడు అర్ధమై అందరం కలసి చేసామని చెప్పాడు. అయన అలాగే కాసేపు అలోచించి ఇప్పుడు దిన్ని ఏమి చేస్తారు అని అడిగాడు. మా వాడు పారేస్తాం అని చెప్పాడు, నేను ఇంటికి తిసుకేలతనని చెప్పాను. మాస్టారు ఏదో అలోచించి అయిపోయింద ఇంకా ఏమైనా చెయ్యల అని అడిగాడు. నేను అయిపోయిందని చెప్పాను. 

బడి  ఒక గది తలుపులు తిసి "లోపల పెట్టండి, రేపు ఉదయం పత్రి తీసుకొని రండి. మనం పూజ చేద్దాం" అని చెప్పాడు. సరే అని తలూపి లోపల పెట్టి మా సామాను తీసుకొని బయలు దేరుతుంటే, "రేపు పిల్లలందరికి చెప్పి తీసుకురండి" అని మళ్ళి చెప్పాడు. అయన ఇల్లు బడికి దగ్గరగానే వుంటుంది, వాళ్ళ ఆవిడని అందరం పిన్ని అనే వాళ్ళం. ఆ మరునాడు ఉదయాన్నే పత్రి తీసుకొని వెళ్ళాం. మష్టారు చెప్తుంటే మేము విగ్రహాన్ని టేబులు మీద పెట్టి, అప్పుడు బడిలో కుర్చోటానికి బారు పీటలు వుండేవి, వాటిని ఒక మండపం లాగా ఒకదానిమీద ఒకటి వేసి తయరు చేసాము. వెళ్లి ఇంట్లో పూజలు చేసుకొని రమ్మని చెప్పాడు. మేము వెళ్లి వచ్చేసరికి పిన్ని పాయసం చేసి తీసుకు వచ్చింది. కొంచం సేపటిలో మావూరి పూజారి, ఉళ్ళో ఉండే మరో ఇద్దరు మస్టారులు వచ్చారు. పూజ చేసి ప్రసాదం పెట్టారు. పెద్ద పిల్లలు అంటే మాకన్నా సీనియర్స్  పక్క ఉరిలో (మా వూరిలో ఐదవ తరగతి వరకే వుంది) చదువుతుంటారు అందరు వచ్చి చూసి, సాయత్రం ఉరేగిద్దాం అని పధకం వేశారు. 

వాళ్లంత  బాగా ఆలోచించి మా వురి రైస్ మిల్లులో లాగుడు బండి వుండేది, దాన్ని మీద వురేగిద్దాం అని మాష్టారుతో మాట్లాడి ఆయనను ఒప్పించారు. వాళ్ళు వెళ్లి ఆ బండిని, పక్క టౌనుకి వెళ్లి రంగు కాగితాలు తెచ్చారు. ఆ బండిని బాగా అలంకరించి దానిలో ఆ సాయంత్రం వురేగింపు మొదలు పెట్టాము. విషయం ఎంటంటే ఏ బజారు పిల్లలు ఆ బజారు వినాయకుడి వెంట తిరిగేవారు అప్పటి వరకూ. ఇది బడిలో చేసినా వినాయకుడు కనుక పిల్లలందరూ మైకులు పెట్టె పని లేకుండా పెద్ద పెద్దగ స్లోగన్స్ చేశారు. అందరు బియ్యం ఇవ్వటం, కొబ్బరికాయలు కొట్టటం, వారు పోయటం చేశారు. మేము తీరిగి బడి చేరుకొనే వరకూ ఆ బండి బియ్యం, కొబ్బరి చిప్పలతో నిండి పోయింది. అవి అన్ని బడిలో సర్ది వెల్లిపోయాము. తరువాత రోజు బడికి వెళితే మాష్టారు బడికి సెలవు ఇచ్చి మాష్టారులు అందరు మాతో పాటు నిమర్జననికి నదికి వచ్చారు. వెళ్లేసరికి మాష్టారు మనుషులని పెట్టి వచ్చిన బియ్యతో పులిహోర చేయించాడు. అది పిల్లలందరం బాదం ఆకులలో పెట్టుకొని బోజనాలు తిన్నట్టు తిన్నాం. మాకు ఆ ముందు రోజు వచ్చిన కానుకలు అన్నీ మాష్టారు కి ఇచ్చాము. మిగతా మాష్టారులు కూడా మాష్టారుకి ఇంకా డబ్బులు ఇచ్చారు అవి అన్ని చేయించినందుకు. మాష్టారు ముందు నిరాకరించారు, మిగతా మాష్టారులు మా దగ్గర వున్న కానుకల డబ్బులు కూడా తీసుకొని ఆయనకి ఇచ్చారు.

ఆ తర్వత సంవత్సరం నుంచి పిల్లలం ఉరిలో చందాలు వసులుచేసి చెయ్యటం మొదలు పెట్టాము, నేను వరుసగా ఐదు సంవత్సరాలు వినాయకుడి బొమ్మను చేశాను. తర్వాత నేను ఊరు నుంచి బయటకి వచ్చను, మాష్టారు కూడా అదే సంవత్సరం బదిలీ అయింది. ఇప్పటికి అలానే బడిలోనే  వినాయక చవితి చేస్తున్నారు, మా బజారులో వినాయకుని పెట్టటం మానేసి బడిలో వినాయకునికి చందాలు ఇస్తున్నారు. ఈ పెద్దోలందరూ పిల్లల వినాయకుడిని వాళ్ళ వినాయకుడిని చేసుకోన్నారు. ఇప్పుడు విగ్రహాలు చెయ్యటం లేదు కొనుకోస్తున్నారు. బడికి ఇంకా రెండు రోజులు సెలవలు ఇస్తున్నారు. అప్పుడు ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహం చేస్తే ఇప్పుడూ 15 అడుగుల విగ్రహం కొనుకోస్తున్నారు. 

అప్పటినుంచి అల మా బడి గుడిల మారింది . ఒక విధంగా నేను మొదలుపెట్టినది అని అనందంగా వున్న పిల్లల నుండి పెద్ద వాళ్ళు లాగేసుకున్నారు అని బాధగా కూడా అనిపిస్తుంది.